రాజస్థాన్లోని నాగావుర్ జిల్లా ముండ్వా పురపాలక సంఘం ఛైర్పర్సన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 10 వార్డుల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, బీజేపీ అధికారిక అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన ఆర్ఎల్పీ అభ్యర్థి విజయం సాధించారు.
మొత్తం 25 వార్డులున్న ముండ్వా పురపాలక సంఘం ఛైర్పర్సన్ ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే, పార్టీ అధికారిక అభ్యర్థి గీతాదేవికి ఒక్క ఓటు కూడా రాకపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) అభ్యర్థి అల్కాదేవి కాండోయ్ 13 ఓట్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
తిరుగుబాటుతో బీజేపీకి నష్టం
ఛైర్పర్సన్ టికెట్ దక్కలేదనే అసంతృప్తితో బీజేపీ సీనియర్ నేత ఘన్శ్యామ్ సదావత్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో బీజేపీకి చెందిన పదిమంది కౌన్సిలర్లు అధికారిక అభ్యర్థిని కాదని ఘన్శ్యామ్కే తమ మద్దతు ప్రకటించారు. ఈ పరిణామంతో పార్టీ అధికారిక అభ్యర్థి గీతాదేవికి సున్నా ఓట్లు వచ్చాయి.
మరోవైపు, 3 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, 7 స్థానాలు గెలుచుకున్న ఆర్ఎల్పీ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. వీరికి ముగ్గురు స్వతంత్ర కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో ఆ కూటమి బలం 13కు చేరింది. కేవలం ఒక్క ఓటు తేడాతో ఆర్ఎల్పీ అభ్యర్థి అల్కాదేవి విజయం సాధించారు.
స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశం ఉన్నప్పటికీ, సొంత కౌన్సిలర్లను ఏకతాటిపై ఉంచలేకపోవడం రాజస్థాన్ బీజేపీ నాయకత్వానికి తీవ్ర రాజకీయ పరాభవంగా మారింది. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.












