హైదరాబాద్, 19 September
గిరిజన ప్రాంతాల్లో పోలీస్ ఉద్యోగ నియామకాల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పలువురు గిరిజన ఎమ్మెల్యేలు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యేలు విశ్వాసం వ్యక్తం చేశారు.
గిరిజన ప్రాంతాల్లోని స్థానిక యువతకు పోలీస్ ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించేందుకు 75 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్తో పాటు పలువురు గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న స్థానిక యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆయా ప్రాంతాల భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, స్థానిక యువతకు ప్రత్యేక అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
పోలీస్ ఉద్యోగాల్లో స్థానిక యువతకు అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు, స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న యువత పోలీస్ శాఖలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. దీంతో ప్రజలకు, పోలీసులకు మధ్య విశ్వాసపూర్వక సంబంధాలు మరింత బలపడతాయని తెలిపారు.
75 శాతం రిజర్వేషన్ అమలుకు అవసరమైన రాజ్యాంగ, చట్టపరమైన అంశాలను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. గిరిజనుల హక్కులు, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
గిరిజన యువతకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.












