తానూర్, 10 September
మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో పొలాల అమావాస్య వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రైతులు తమ ఎడ్లను శుభ్రంగా స్నానం చేయించి, పూలదండలు, గజ్జెలు, రంగురంగుల అలంకరణలతో ముస్తాబు చేశారు. ప్రతి ఇంటిలోనూ ప్రత్యేక వంటకాలు తయారుచేసి, ఎడ్లకు నైవేద్యాలుగా సమర్పించారు.
ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో పొలాల అమావాస్య వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రైతులు తమ ఎడ్లను శుభ్రంగా స్నానం చేయించి, పూలదండలు, గజ్జెలు, రంగురంగుల అలంకరణలతో ముస్తాబు చేశారు.ప్రతి ఇంటా ప్రత్యేక వంటకాలు తయారు చేసి ఎడ్లకు నైవేద్యాలు సమర్పించారు. హనుమాన్ ఆలయాల్లో బసవన్నలకు పూజలు నిర్వహించి ప్రదక్షిణలు చేశారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి పసుపు, కుంకుమలతో పూజల్లో పాల్గొన్నారు. భజన బృందాలు సంప్రదాయ గీతాలు ఆలపిస్తూ గ్రామ వీధుల్లో సందడి చేశాయి.ఏడాది పొడవునా వ్యవసాయ పనుల్లో రైతులకు అండగా నిలిచే ఎడ్లను గౌరవించడమే పొలాల అమావాస్య పండుగ ముఖ్య ఉద్దేశమని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా బసవన్నలను పూజించి సాంబశివుడిని ప్రార్థిస్తే కుటుంబాల్లో సుఖసంతోషాలు, పంటలు సమృద్ధిగా ఉంటాయని విశ్వసిస్తారు. గ్రామాల వారీగా రైతులు ఒకచోట చేరి బసవన్నలతో ఊరేగింపులు నిర్వహించారు. పలుచోట్ల జాతరను తలపించేలా సందడి నెలకొంది. చిన్నారులు ఎడ్ల బొమ్మలతో ఆటలాడుతూ ఆనందించారు. సాయంత్రం వరకు పూజలు, ఊరేగింపులు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. పొలాల అమావాస్య వేడుకలతో మండలంలోని గ్రామాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.












