హుజూరాబాద్, 10 September
భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందని హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. హుజురాబాద్ పట్టణంలో రజక యువజన సంఘం ఆధ్వర్యంలో ఆమె వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఐలమ్మ స్ఫూర్తి ప్రజలకు ఆదర్శం హుజురాబాద్, సెప్టెంబరు 10: వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి ప్రజలకు ఆదర్శంగా నిలిచిందని హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. హుజురాబాద్ పట్టణంలో రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ అధ్యక్షతన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, పట్టణ సీఐ కరుణాకర్ హాజరయ్యారు. రజక సంఘం పట్టణ అధ్యక్షుడు కొండపాక శ్రీనివాస్‌తో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన ఘనత చాకలి ఐలమ్మకే దక్కుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటిన ధీరవనితగా ఐలమ్మ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యం, పోరాట పటిమ, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఐలమ్మ పోరాటం చరిత్రలో చిరస్థానం దొరల పెత్తనం, వెట్టిచాకిరీ, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆమె అన్యాయాన్ని ఎదిరించి హక్కుల కోసం వెనుకడుగు వేయకుండా పోరాడిన ధీరవనిత అని కొనియాడారు. ఐలమ్మ చూపిన తెగువతో అణగారిన ప్రజల్లో హక్కుల కోసం పోరాడాలనే చైతన్యం పెరిగిందన్నారు. నేటి యువత ఆమె జీవిత చరిత్రను తెలుసుకుని సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగించడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కోయాల్కర్ భారతి, సొల్లు సునీత, వెంకన్న, రజక సంఘం ప్రధాన కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్, కొలిపాక సారయ్య, నల్ల బాలరాజు, కొలిపాక శంకర్, సుంకరి రాజమౌళి, కొలిపాక పోచయ్య, కొలిపాక శ్రీనివాస్, కొలిపాక రవి, జనార్ధన్, తాళ్లపల్లి శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్, వేల్పుల ప్రభాకర్, రత్నం, కొలిపాక సమ్మయ్య, సొల్లు బాబు, చిలకమర్రి శ్రీనివాస్, కొండపాక పవన్‌కుమార్, కే. క్రాంతికుమార్, కొలిపాక రంగయ్య, సైదాపూర్ మాజీ ఎంపీపీ వెంకట్రాజం తదితరులు పాల్గొన్నారు. యువజన సంఘం ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యావంతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొని ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు.












