చెడు చేసేవారికి ఎన్నటికీ విజయం దక్కదని, ఎప్పటికైనా మంచిదే గెలుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా కరీంనగర్ మహాశక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఆయన, చెడును వీడి ఇతరులకు సేవ చేస్తేనే అమ్మవారి కరుణ ఉంటుందని తెలిపారు.
కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల చివరి రోజున, సోమవారం అమ్మవారు మహిషాసుర వర్ధిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని, చండీ యాగంలో పాల్గొన్నారు. అనంతరం భవానీ దీక్షను విరమించారు. సాయంత్రం ఆలయంలో జరిగిన రావణ దహన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, హిందూ బంధువులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయని పేర్కొన్నారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో వేలాది మంది భక్తులు దీక్షలు చేపట్టారని, అమ్మవారిని మొక్కుకుంటే కోరికలు తీరుతాయనే నమ్మకం భక్తుల్లో ఏర్పడిందని చెప్పారు.
దేశంలోనే కాకుండా, విదేశాల్లోని తెలుగు కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకున్నాయని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటున్నామని, పొరపాటున చెడు చేసినా, ప్రవర్తన మార్చుకుని ఇతరులకు సేవ చేస్తే అమ్మవారి కరుణ ఉంటుందని, చెడు ఎప్పటికీ విజయం సాధించదని ఆయన స్పష్టం చేశారు.











