జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం నవరాత్రులలో ఎనిమిదో రోజును పురస్కరించుకుని అమ్మవారిని మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చేలా ప్రత్యేకంగా అలంకరించారు.
నవరాత్రులలో ఎనిమిదో రోజున అమ్మవారిని మహాగౌరిగా పూజించడం ఆనవాయితీ. గౌరీ అంటే తెలుపు అని అర్థం. మహాగౌరి రూపంలో అమ్మవారు చతుర్భుజాలతో, ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకం ధరించి, మిగిలిన రెండు చేతులతో అభయ, వరద ముద్రల్లో దర్శనమిస్తారని ఆధ్యాత్మిక విశ్వాసం.
తెల్లని వృషభ వాహనంపై మహాగౌరి అమ్మవారు కొలువుదీరినట్లు పురాణాల్లో పేర్కొంటారు. ఈ రూపాన్ని తొమ్మిది సంవత్సరాల బాలిక స్వరూపంగా భావిస్తారు. అందుకే పలు ప్రాంతాల్లో మహాగౌరి అమ్మవారి ప్రతిరూపంగా కన్యాపూజ నిర్వహించే సంప్రదాయం ఉంది.
శ్రీరాముడిని పొందేందుకు సీతాదేవి గౌరీవ్రతం ఆచరించినట్లు పురాణ ప్రాశస్త్యం ఉంది. వివాహం కాని స్త్రీలు, కన్యలు మహాగౌరి అమ్మవారిని తెల్లని పూలతో పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
బెల్లం అన్నం నైవేద్యంగా సమర్పణ
మహాగౌరి అమ్మవారికి ఆదివారం బెల్లం అన్నం నైవేద్యంగా సమర్పించారు. ప్రత్యేక పూజలు, నైవేద్య కార్యక్రమాలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
మహాగౌరి ధ్యాన శ్లోకం
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా











