జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారు శ్రీ కాలరాత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి కిచిడీని నైవేద్యంగా సమర్పించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం చేయించడంతో పాటు, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా కుమారి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రెండేళ్ల నుంచి పదేళ్లలోపు బాలికలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలుగా భావించి పూజలు చేశారు. బాలికల పాదాలను పసుపు నీటితో శుద్ధి చేసి, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
అనంతరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి అంజనీ దేవి, ఆలయ అర్చకులు బాలికలకు నైవేద్యం, తాంబూలం అందించి ఆశీర్వదించారు. నవరాత్రుల్లో కుమారి పూజ నిర్వహించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని, గ్రహదోషాలు తొలగి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం.
మరోవైపు, బాసర క్షేత్రం భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుంచి మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్.











