నల్గొండ జిల్లా మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ, ప్రైవేట్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఆర్ఐగా పనిచేస్తున్న రాళ్లబండి గోపరాజుతో పాటు, ఆయన ప్రైవేట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యెదుళ్ల యాదగిరిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఒక రైతుకి చెందిన వ్యవసాయ భూమికి సంబంధించిన పంచనామా నివేదికను తహసీల్దార్‌కు సమర్పించేందుకు ఆర్ఐ గోపరాజు రూ. 15,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, పథకం ప్రకారం అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ వ్యక్తి అయిన యాదగిరి ద్వారా రూ. 15,000 లంచం డబ్బులు స్వీకరిస్తుండగా ఏసీబీ నల్గొండ రేంజ్ టీం దాడి చేసి, ఆ డబ్బును స్వాధీనం చేసుకుంది.
లంచం తీసుకున్న ఆర్ఐ గోపరాజుతో పాటు, ఆయనకు సహకరించిన ప్రైవేట్ వ్యక్తి యాదగిరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులనూ హైదరాబాద్ లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఏదైనా ప్రభుత్వ శాఖల్లో అధికారులు లంచం అడిగితే తక్షణమే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా సంప్రదించాలని అధికారులు ప్రజలను కోరారు.











