నందిగామ పరిధిలో సంచలనం సృష్టించిన కుమ్మరి మంగమ్మ (48) హత్య కేసును ఫ్యూచర్ సిటీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 28 గ్రాముల బంగారు పుస్తెలతాడు, మృతురాలి మొబైల్ ఫోన్, ఆటోతో పాటు పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాల దృశ్యాలు, కాల్‌డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించారు. మంగమ్మను నందిగామ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు పుస్తెలతాడు, మొబైల్ ఫోన్‌ను అపహరించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలానికి చెందిన ఆటో డ్రైవర్ ఇస్లావత్ చంద్రబాబు (28)ను ఏ1గా, పట్లావత్ మహేందర్ (21)ను ఏ2గా పోలీసులు గుర్తించారు. మంగమ్మకు చెందిన 28 గ్రాముల బంగారు పుస్తెలతాడును బాలానగర్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో సుమారు రూ.లక్షకు తాకట్టు పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 28 గ్రాముల బంగారు పుస్తెలతాడు, మృతురాలి మొబైల్ ఫోన్, ఐక్యూ మొబైల్ ఫోన్, ముత్తూట్ ఫైనాన్స్ రసీదు, టీజీ 06 టీ 8887 నంబర్ ఆటో, బీరు సీసా ముక్కలు, రూ.300 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై నందిగామ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 281/2026గా భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 103(1), 70(1), 303(2)తో పాటు 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలు, కాల్‌డేటా, సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా విశ్లేషించి నిందితులను గుర్తించి కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని షాద్‌నగర్ జోన్ డీసీపీ శిరీష రాఘవేంద్ర అభినందించారు.











