మండలంలోని స్వర్ణ గ్రామంలో స్వర్ణ ప్రాజెక్ట్‌కు చెందిన ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని స్థానిక గ్రామస్తులు ఆరోపించారు. ఈ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని వారు సోమవారం జిల్లా కలెక్టర్‌ను ప్రజావాణి కార్యక్రమంలో కలిసి కోరారు.
స్వర్ణ ప్రాజెక్ట్ పరిధిలోని ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుని, నివాస గృహాలు, ఇతర నిర్మాణాలు చేపట్టి అద్దెలకు ఇస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణాలపై గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు వచ్చి సర్వే చేసి వెళ్లడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల సర్వేలతో కాలయాపన జరుగుతోందే తప్ప ఎలాంటి ఫలితం కనిపించడం లేదని గ్రామస్తులు తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు వచ్చి వెళ్లడం తప్ప ఆక్రమణల తొలగింపునకు చొరవ చూపడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ నేరుగా స్పందించి, వారి పర్యవేక్షణలోనే సమగ్ర సర్వే నిర్వహించి, స్వర్ణ ప్రాజెక్ట్ పరిధిలోని కబ్జా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.












