ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని శ్రీ వేద భారతి పీఠంలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 17న ప్రారంభమైన కార్యక్రమాలు బ్రహ్మశ్రీ వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
నాలుగు రోజులుగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వస్తి వాచనం, ఆయుష్య హోమం, ధన్వంతరి హోమం, రాజ్యాధికార హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని, దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా, సురక్షితంగా వర్ధిల్లాలని సంకల్పంతో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య దేశ క్షేమం, ప్రజల ఆయురారోగ్యాల కోసం వేదాశీర్వచనం నిర్వహించారు. కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన యువ నాయకుడు సర్జేరావ్ దాగే పాటిల్, ఆయన అనుచరులు, వేద పాఠశాల విద్యార్థులు, వైదిక గురువులు, పీఠ నిర్వాహకులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేద విద్యానంద స్వామీజీ మాట్లాడుతూ, వేదాలు భారతీయ సంస్కృతికి మూలాధారమని అన్నారు. వేద మంత్రాలతో నిర్వహించే హోమాలు వ్యక్తిగత శ్రేయస్సుతో పాటు లోకకల్యాణం, ప్రకృతి సమతుల్యత, దేశ సుభిక్షత కోసం దోహదపడతాయని పేర్కొన్నారు. నిత్య వేద పఠనం ద్వారా మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం పెంపొందుతాయని తెలిపారు.
యువత వేద విద్యను అభ్యసించి, భారతీయ సనాతన సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.












