వినాయక చవితి ఉత్సవాల్లో అబ్దుల్లాపూర్ గ్రామం మత సామరస్యాన్ని చాటుతోంది. మండలంలోని ఈ గ్రామంలో 40 ఏళ్లుగా గ్రామస్తులంతా కలిసి ఒకే గణపతిని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం మోక్ష (కర్ర) గణపతి వద్ద జరిగిన భజన, కీర్తనల్లో చాక్పెల్లికి చెందిన షేక్ హైమద్ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.
గ్రామంలో 11 రోజులపాటు జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో హిందువులతో పాటు ముస్లిం కుటుంబాలు కూడా పాల్గొంటున్నాయి. గణపతి ప్రసాదం స్వీకరించడంతో పాటు ఉత్సవాల నిర్వహణకు తమవంతు సహకారం అందిస్తున్నాయి. 11 రోజులపాటు గ్రామస్తులంతా ఇళ్లలో వంట చేసుకోకుండా గణపతి మండపంలో తయారుచేసే మహాప్రసాదాన్ని ఉదయం, సాయంత్రం కలిసి స్వీకరిస్తున్నారు.
అన్నదానానికి ముందస్తు బుకింగ్
గణపతి మండపం వద్ద నిర్వహించే అన్నదానానికి భక్తుల నుంచి మంచి స్పందన ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. అన్నదానం నిర్వహించే అవకాశం కోసం మూడేళ్ల ముందుగానే బుకింగ్లు పూర్తవుతున్నాయని చెప్పారు. భక్తులు, గ్రామస్తులు కలిసి మహాప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మద్యం, మాంసాహారానికి దూరం
వినాయక నవరాత్రుల 11 రోజులపాటు గ్రామస్తులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. పూజలు, భజనలు, కీర్తనలు, అన్నదాన కార్యక్రమాలను అందరూ కలిసి నిర్వహిస్తున్నారు.
కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఒకే చోట చేరి ఉత్సవాలను నిర్వహించడం అబ్దుల్లాపూర్ ప్రత్యేకతగా నిలుస్తోంది. పరస్పర సహకారం, ఐక్యతతో కొనసాగుతున్న ఈ సంప్రదాయం గ్రామంలో మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.












