గోదావరి పుష్కరాల పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం బాసర ఈవో కార్యాలయంలో పుష్కరాల పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బాసరలో పుష్కరాలకు వచ్చే భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. భక్తులకు, వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, సంఖ్య లెక్కింపు అంశాల్లో కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. చేపట్టే పనులను సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనులన్నీ నాణ్యవంతంగా ఉండాలని స్పష్టం చేశారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, రద్దీ మేరకు తగిన రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, తగినన్ని మరుగుదొడ్లు, త్రాగునీటి వసతి కల్పించాలని సూచించారు. హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని కూడా తెలిపారు.
అనంతరం, పుష్కరాల కొరకు బాసరలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని కలెక్టర్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యుఎస్, నీటిపారుదల శాఖల ఈఈలు సుభాష్, సందీప్, అనిల్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసిల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












