ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో ఓట్లు తొలగించడం, నోటీసులు జారీ చేయడంపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఓటు హక్కు పరిరక్షణకు ఐక్య కార్యాచరణతో ముందుకు రావాలని పిలుపునిచ్చాయి. విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భారీ స్థాయిలో ఓట్లు తొలగించడం, లక్షలాది మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయడంపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు ఐక్య కార్యాచరణతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక సమగ్ర సవరణపై విజయవాడ దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం మంగళవారం జరిగింది. దీనికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ముసుగులో ఓటర్ల జాబితాల నుంచి పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా 13 కోట్ల 37 లక్షల ఓట్ల తొలగింపు అంటే సాధారణ విషయం కాదన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇప్పటికే 44 లక్షల ఓట్లను తొలగించారని, మరో 42 లక్షల మంది ఓటర్లకు వివిధ కారణాలతో నోటీసులు జారీ చేశారన్నారు. అంటే దాదాపు కోటి ఓట్ల తొలగింపునకు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్న ఎన్నికల కమిషన్ ప్రకటనపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో 18 ఏళ్లు నిండిన వయోజనులు 103 కోట్ల మంది ఉంటే 88 కోట్ల మందికి మాత్రమే ఓటు హక్కు ఉందని తెలిపారు. ఎంఆర్సీ, సీఐఏ, ఎస్ఐఆర్, డీలిమిటేషన్, ఒకే దేశం - ఒకే ఎన్నికలు ఈ అంశాలను బీజేపీ కుట్రల్లో భాగమన్నారు. దీనిని సాంకేతికంగా, రాజకీయంగా ఎదుర్కొవాలని సూచించారు. ఎస్ఐఆర్లో సామాన్య ప్రజల ఓట్లను తొలగిస్తున్నట్లు చెప్పారు. వీరిలో పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికే ఓటు పరిరక్షణ వేదిక ఏర్పాటు చేశామని, ఓటర్లకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశ్రాంత ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి ఓటరు తన ఓటు హక్కు కోసం పదేపదే తాను అర్హుడినని నిరూపించుకోవాల్సిన దుస్థితి సరికాదన్నారు. వైసిపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్న అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ ముసుగులో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మైనార్టీ ఓట్ల తొలగింపునకు కంకణం కట్టుకుందన్నారు. ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకులు అమర్నాథ్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ప్రసాద్, సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్ నాయకులు ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో సిపిఐ నాయకులు జల్లి విల్సన్, అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, వి. దుర్గాభవానీ, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు, మేధావులు పాల్గొన్నారు.











