భూముల రీ సర్వేతో ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మండలం న్యూ వెల్మల్ గ్రామంలో శుక్రవారం భూ రీ సర్వే పురోగతిపై గ్రామస్తులు, రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రీ సర్వే ప్రక్రియ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. న్యూ వెల్మల్‌లో ఇప్పటికే 80 శాతం రీ సర్వే పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూముల హద్దులు, హక్కులకు సంబంధించిన సమస్యలకు రీ సర్వే ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సర్వే సమయంలో రైతులు తమ భూముల వద్ద అందుబాటులో ఉండి, అధికారులకు సహకరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే సజావుగా సాగేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రీ సర్వేకు రైతులు అందిస్తున్న సహకారాన్ని కలెక్టర్ అభినందించారు.
గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న భూ సమస్యలకు రీ సర్వే ద్వారా పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేశారు. సర్వే పూర్తయ్యే వరకు అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఏడీ ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ విఠల్, తహసీల్దార్ సంతోష్, సర్పంచ్ సాగర్, సంబంధిత అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.












