కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న భూ సంస్కరణలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో వాస్తవాలతో తిప్పికొడతామని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ అన్నారు. 22ఏ నిషేధిత భూములపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన భూ హక్కుదారులకు న్యాయం చేసేందుకే ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఆసిఫాబాద్‌లోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఏబీ శ్రీనివాస్ మాట్లాడారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి, అర్హులైన భూ హక్కుదారులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. భూ రికార్డుల్లోని సమస్యలను పరిష్కరించడంతో పాటు రైతులు, పేదల భూ హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం భూ భారతి వ్యవస్థలో నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిన భూములపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సేవ కూడా అందుబాటులో ఉందని ఏబీ శ్రీనివాస్ వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ఆయన విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో భూ సమస్యలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో గత పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, రైతుల హక్కులు, పేదల భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని వాస్తవాలతో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు గాలి మాటలు చెప్పడం కాకుండా దమ్ముంటే శాసనసభకు వచ్చి చర్చించాలని ఏబీ శ్రీనివాస్ సవాల్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు ఏలేటి అశ్విన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాలేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, మాజీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుద్దాల శ్రీనివాస్, ఆసిఫాబాద్ అర్బన్, మండల అధ్యక్షులు రాపర్తి మురళి, ఇమ్రాన్, ఆసిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కట్కర్ భీంరావు, పి. సుధాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారుతి పటేల్, శంకర్, తిరుపతి, నారాయణ, ఖలీమ్, రాము, కృష్ణ, సాయి, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.












