కాజీపేటలో పోలీసులు భారీగా రద్దయిన పాత కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.1,38,50,000 విలువైన రద్దు చేసిన పాత రూ.500, రూ.1,000 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు రూ.6 వేల చెల్లుబాటు అయ్యే నగదు, 10 సెల్ఫోన్లు, ఒక కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ముఠా పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. రద్దయిన పాత కరెన్సీని అక్రమంగా చలామణి చేసేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పాత కరెన్సీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దాని వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.












