మిర్యాలగూడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు మంత్రి పలు హామీలు ఇచ్చారు.
మిర్యాలగూడ పట్టణంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) మాట్లాడుతూ, మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు పలు అంశాలను ప్రస్తావించారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలలో అర్హత ఉన్న ప్రతి గ్రామానికి చౌకధర దుకాణం మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందిస్తూ వారం రోజుల్లోగా అర్హత ఉన్న ప్రతి గ్రామానికి రేషన్ షాపు మంజూరు చేస్తానని సభాముఖంగా ప్రకటించారు. దీంతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, మిర్యాలగూడలో ఎన్ఎస్పీ స్థలంలో తహసిల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నిధులు కేటాయించాలని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని, డిఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధుల ద్వారా అన్ని గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, నర్సింగ్ కళాశాల పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేస్తామని, మిర్యాలగూడ పట్టణంలోని ఫ్లైఓవర్ కు సంబంధించిన ఫైలు క్లియర్ చేస్తామని, మిర్యాలగూడ బస్టాండ్ ను ఆధునికరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.












