గణపతి ఉత్సవాల నేపథ్యంలో ప్రజలు, నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచించారు. విగ్రహాల ఏర్పాటు, డీజేల వినియోగం, డ్రోన్ల వాడకం వంటి అంశాలపై ఆయన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నిబంధనలు సెప్టెంబరు 16 నుంచి 30 వరకు అమలులో ఉంటాయి.
గణపతి ఉత్సవాల నేపథ్యంలో ప్రజలు నిబంధనలు పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు సెప్టెంబరు 16 నుంచి 30 వరకు అమలులో ఉండేలా పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పోలీస్ పీఆర్వో తెలిపారు.
విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, జనసమ్మర్థ ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్లు, ప్రభుత్వ భవనాల వద్ద విగ్రహాలు ఏర్పాటు చేయరాదని సూచించారు. విగ్రహాల ఏర్పాటుకు సంబంధిత అనుమతులు ముందుగానే పొందాలని తెలిపారు.
డీజేలు, లౌడ్‌స్పీకర్లపై ఆంక్షలు
అధిక శబ్దంతో డీజేలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల వినియోగం నిషేధమని తెలిపారు. సభలు, ఊరేగింపులు, లౌడ్‌స్పీకర్ల వినియోగానికి ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరన్నారు. 500 మందితో సమావేశానికి సంబంధిత ఏసీపీ అనుమతి, అంతకుమించిన జనసమూహం ఉంటే 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని సూచించారు.
డ్రోన్ల వినియోగంపై నియంత్రణ
ప్రజా కార్యక్రమాల్లో డ్రోన్లు వినియోగించాలంటే సంబంధిత ప్రభుత్వ విభాగాలు, పోలీస్, విమానయాన అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు.
ఉపాధి, పాస్‌పోర్టు, వీసా, రవాణా తదితర సేవల పేరుతో మోసాలకు పాల్పడే నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు ఇళ్లను అద్దెకు తీసుకోవడానికి వస్తే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మహిళలు, పిల్లలు, ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే ఎ సర్టిఫికెట్ పొందిన సినిమాలను మైనర్లు వీక్షించకుండా థియేటర్ల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని సూచించారు.
మాల్స్, సినిమా థియేటర్లు, హోటళ్లు, ఎగ్జిబిషన్లు, వ్యాపార ప్రాంతాల్లో భద్రతా నిబంధనలు పాటించాలని, ప్రజలు క్యూలోనే సేవలు పొందాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.












