సిరికొండ సిరికొండమండలంలోని గోధుమల్యాలు గగ్రామంలో అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మొక్కలు ఎండిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో పెంచుతున్న మొక్కలు సరైన సంరక్షణ లేక నాశనమవుతున్నాయని వారు వాపోతున్నారు.
ప్రతి సంవత్సరం మొక్కల పెంపకం కోసం ప్రభుత్వం నర్సరీలను ఏర్పాటు చేసి, మొక్కలు పెరిగి పెద్దవయ్యాక అడవుల్లో నాటేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. అయితే, సిరికొండ మండలంలో అటవీశాఖ అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో నాటిన మొక్కలు కూడా ఎండిపోయి నిరుపయోగంగా మారుతున్నాయి. ఈ దృశ్యం గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం మొక్కల పెంపకం కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యం వల్ల పచ్చదనం తగ్గిపోతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అధికారులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై అటవీశాఖ అధికారులు స్పందించి, మొక్కల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు ఇలాగే విఫలమైతే పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












