జిల్లా బాసరలోని శ్రీ వేద భారతి పీఠంలో దేశ సుభిక్షత, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ వైదిక హోమాలు నిర్వహించారు. శ్రీ వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 17న ప్రారంభమైన కార్యక్రమాల్లో భాగంగా స్వస్తి వాచనం, ఆయుష్య, ధన్వంతరి, రాజ్యాధికార హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
దేశం ధర్మమార్గంలో పురోగమించాలనే సంకల్పంతో, ధర్మో రక్షతి రక్షితః, లోకాః సమస్తాః సుఖినో భవంతు అనే ఘోషతో హోమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశ క్షేమం, ప్రజా క్షేమం, పాలకులకు ధర్మబుద్ధితో, సత్యనిష్ఠతో కూడిన సుపరిపాలన సిద్ధించాలనే మహా సంకల్పంతో వేదమూర్తులచే చతుర్విధ హోమాలు నిర్వహించినట్లు స్వామీజీ పేర్కొన్నారు. వేద ధర్మ సంస్థాపన, గో సంరక్షణకు కృషి చేస్తున్న వారి ఆయురారోగ్యాలు, యశస్సు వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కేవలం హోమంగా కాకుండా ధర్మ రక్షణ యజ్ఞంగా భావిస్తున్నట్లు స్వామీజీ పేర్కొన్నారు.










