మండలం బామ్నీ గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చివరి హారతి కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
నిమజ్జనానికి ముందు జరిగిన చివరి హారతి కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనంద్ రావు పాటిల్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర బాయి రాజన్న, గ్రామ పంచాయతీ సర్పంచ్ గణేష్ పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి, చివరి హారతి సమర్పించారు.
ఈ సందర్భంగా సిందే ఆనంద్ రావు పాటిల్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలను గ్రామస్థులందరూ కలిసి శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. ఒకే గణనాథుడిని పూజించి, గ్రామంలోని ప్రతి ఒక్కరూ కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం బామ్నీ గ్రామస్థుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య సోదరభావం, ఆత్మీయత, ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు.
గ్రామంలో గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు, గ్రామ పెద్దలను ఆయన అభినందించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేలా గ్రామస్థులు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. పండుగలను శాంతియుతంగా నిర్వహించడం ద్వారా గ్రామంలో స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడుతుందని తెలిపారు.
చివరి హారతి కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గణేష్, ఉప సర్పంచ్ గంగాధర్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణనాథుడికి హారతి అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గణపతి బప్పా మోరియా నినాదాలతో గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు.
గ్రామంలో భక్తుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొనగా, చిన్నారులు సైతం గణనాథుడి నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా గ్రామస్థులంతా కలిసి సోదరభావంతో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.











