గణపతి నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని, యువతతో నేరుగా మాట్లాడుతూ పోలీసు-ప్రజల సత్సంబంధాలను మెరుగుపరచడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. బోథ్ మండల కేంద్రంలో, పొచ్చర, ధన్నూర్ బి గ్రామాల్లోని గణపతి మండపాలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దర్శించి పూజా కార్యక్రమాలను నిర్వహించి గణనాథుని సేవలో పాల్గొన్నారు.
నిమజ్జనంపై సూచనలు
బోథ్ మండల కేంద్రంలోని మునూరు కాపు సంఘం, ఎస్సీ కాలనీ, చైతన్య యూత్, హనుమాన్ మందిర్, పోచమ్మ గల్లిలోని ప్రధాన గణపతి మండపాలను దర్శించి, గణపతి మండప కమిటీ సభ్యులతో నేరుగా మాట్లాడారు. నిమజ్జనాన్ని సరైన సమయంలో పూర్తి చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, ఇతర గణపతి మండపాలతో పోటీ లేకుండా నిమజ్జన ఉత్సవాలను జరుపుకోవాలని తెలిపారు. దాదాపు మండల కేంద్రంలోని 8 మండపాలను దర్శించి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నిబంధనల అమలు
నిమజ్జన ఉత్సవాలలో ఎలాంటి డీజేలకు, లేజర్ లైట్లకు, పేపర్ చెల్లె యంత్రాలకు అనుమతి లేదని తెలిపారు. డీజే పాటలలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పాటలు లేకుండా చూడాలని సూచించారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100/112 ద్వారా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. గణపతి నిమజ్జనాన్ని సరైన సమయంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, బోథ్ సీఐ డి గురుస్వామి, ఎస్ఐ వి పురుషోత్తం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











