భైంసా పట్టణంలో రేపు జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీస్ ఆధ్వర్యంలో సోమవారం భైంసా పట్టణంలో పోలీస్ సిబ్బందితో రూట్ మార్చ్ నిర్వహించారు. నిమజ్జన శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాలు, కూడళ్లు, సున్నిత ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు నిమజ్జన కార్యక్రమాలను వీలైనంత త్వరగా ప్రారంభించి, వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిమజ్జనాన్ని త్వరగా పూర్తి చేసుకునేలా సహకరించాలని కోరారు.
నిమజ్జన శోభాయాత్రలో డీజే సౌండ్‌ను పరిమితులకు లోబడి వినియోగించాలని, అధిక శబ్దం ఆరోగ్యానికి హానికరమని, నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
గణేష్ మండపాల నిర్వాహకులు, యువత మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పోలీస్ శాఖ సూచించిన మార్గాలు, నిబంధనలు పాటించాలని, విద్యుత్ తీగలు, హైటెన్షన్ వైర్లు, ట్రాఫిక్ తదితర ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఈ రూట్ మార్చ్‌లో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీస్, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీస్, పోలీస్ అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, పట్టణంలో రేపు నిర్వహించనున్న 9వ రోజు గణేష్ శోభాయాత్రను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీస్, గుల్జార్ మజీద్ ప్రాంతంతోపాటు శోభాయాత్ర కొనసాగే ప్రధాన మార్గాలను పరిశీలించారు.
శోభాయాత్ర ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలు, శోభాయాత్ర మార్గాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు.
శోభాయాత్ర సమయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమన్వయంతో విధులు నిర్వహించాలని, ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ జానకి ఆదేశించారు. గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించి శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీస్ తో పాటు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సమ్మయ్య, ఎస్ఐలు శ్రీకాంత్, జాఫర్, సాయి సిద్ధార్థ్, ఆర్ఎస్ఐ ఎం. రవి తదితరులు పాల్గొన్నారు.


