కామారెడ్డి పట్టణం, కామారెడ్డి, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
కుటుంబంతో గొడవపడి ఆత్మహత్యకు పాల్పడాలని రైల్వే స్టేషన్ వైపు వెళ్లిన 17 ఏళ్ల బాలుడిని పోలీసులు సకాలంలో అడ్డుకున్నారు. డయల్ 100కు అందిన సమాచారంతో స్పందించిన కానిస్టేబుళ్లు, బాలుడిని సురక్షితంగా పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.
డయల్ 100 తక్షణ స్పందనతో బాలుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు : మనోరంజని తెలుగు టైమ్స్ ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన 17 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు యత్నించగా, డయల్ 100కు అందిన సమాచారంతో పోలీసులు సకాలంలో స్పందించి అతడి ప్రాణాలను కాపాడారు. కుటుంబ సభ్యులతో గొడవ అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానంటూ బాలుడు రైల్వే స్టేషన్ వైపు పరుగెత్తాడు. తల్లి అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా, బాలుడు గోడ దూకి రైల్వే పట్టాల వైపు వెళ్లాడు. దీంతో ఆందోళనకు గురైన తల్లి వెంటనే డయల్ 100కు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న కానిస్టేబుళ్లు కళ్యాణ్ (PC 2918), సాయికుమార్ (PC 2934) వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి, బాలుడి సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా గాలింపు చేపట్టారు. లొకేషన్ గాంధీరమ్మ ఆసుపత్రి ప్రాంతాన్ని చూపించడంతో అక్కడ పరిసరాల్లో విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో తల్లి తెలిపిన వివరాల ప్రకారం ఆకుపచ్చ రంగు చొక్కా ధరించిన వ్యక్తిని గుర్తించిన కానిస్టేబుల్ కళ్యాణ్ అతడి వెంట పరుగెత్తి బాలుడిని సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో స్పందించి బాలుడి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు కళ్యాణ్, సాయికుమార్‌లను కామారెడ్డి పట్టణ సీఐ నరహరి ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల తక్షణ స్పందనపై బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.












