హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త రోకలి బండతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తేజశ్రీ అనే మహిళ మృతిచెందింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తేజశ్రీ (28), కుప్పల నరేందర్ దంపతులు. నరేందర్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఒక హోటల్/బార్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ దంపతులు సుమారు నాలుగు నెలల క్రితం బాగ్‌లింగంపల్లికి వచ్చి నివాసం ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు లోహిత్ ఉన్నాడు.
ఆదివారం ఉదయం కుటుంబ విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన నరేందర్ ఇంట్లో ఉన్న రోకలి బండతో భార్య తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
తీవ్ర గాయాలతో తలకు రక్తస్రావం కావడంతో తేజశ్రీ అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎల్. మధుబాబు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












