కామారెడ్డి, 13 September
కామారెడ్డి లేబర్ అడ్డలో మాదక ద్రవ్యాల వినియోగం, మైనర్ల డ్రైవింగ్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
లేబర్ అడ్డలో పోలీసుల అవగాహన : మాదక ద్రవ్యాల వినియోగం, మైనర్ల డ్రైవింగ్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై కామారెడ్డి లేబర్ అడ్డలో పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కళాబృందం సభ్యులు మాటలు, పాటల ద్వారా కూలీలకు అవగాహన కల్పించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మైనర్లు వాహనాలు నడపరాదని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎవరితోనూ ఓటీపీలు పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు, మాదక ద్రవ్యాల సమాచారం కోసం 1908కు ఫోన్ చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100/112ను సంప్రదించాలని, మహిళల రక్షణ కోసం షీ టీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. పోలీసు కళాబృందం ఇన్చార్జిలు హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, యు. శేషారావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.











