రాష్ట్రంలో జర్నలిస్టులు తీవ్రమైన వృత్తిపరమైన ఒత్తిళ్లకు గురవుతున్నారని, ఇది ఆకస్మిక మరణాలకు దారితీస్తోందని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా () రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండం, అంతర్గాం ప్రెస్ క్లబ్ ల ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో జర్నలిస్టులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని, ఫలితంగా ఆకస్మిక మరణాలకు గురవుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా () రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండం, అంతర్గాం ప్రెస్ క్లబ్ లను ఆయన, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ జర్నలిస్టుల స్థితిగతులను ప్రభుత్వం పరిశీలించి, వారి సంక్షేమానికి సంబంధించిన చర్యలు సత్వరం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పాత్రికేయ వృత్తిలో పెరిగిన పోటీ తత్వం, యాజమాన్యాల ఒత్తిళ్లు జర్నలిస్టుల వృత్తిని కత్తిమీద సాములా మార్చివేశాయని అన్నారు. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తున్న జర్నలిస్టులు యాజమాన్యాల నుండి వేతనాలు లేక, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందక, వెట్టి చాకిరి వ్యవస్థలో మగ్గిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పత్రికా రంగం, ఆ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న జర్నలిస్టుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేయించాలని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో నూటికి 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారే కావడంతో, వారి సంక్షేమం కోసం ఒక సమగ్ర చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా విధానాలు మారుతుండడంతో, జర్నలిస్టులకు సంబంధించి నివాస స్థలాల జీవోలు, జీవిత బీమాకు సంబంధించిన ఉత్తర్వులు ఊసు లేకుండా పోతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం కేవలం అక్రిడికేషన్లు జారీ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు నిర్దిష్ట పద్ధతిలో సాగేందుకు వీలుగా చట్టం తీసుకురావాలని కోరారు.
మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలవబడుతున్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా () అనుబంధంగా రామగుండం, అంతర్గాం ప్రాంతాలలో ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు స్థానిక పాత్రికేయులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. దీనికోసం విశేషంగా కృషి చేసిన పంజాల రాధాస్వామి గౌడ్ ను ఆయన అభినందించారు. త్వరలో గోదావరిఖని కేంద్రంలోనూ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. సభ్యుల సంఖ్యను ప్రామాణికంగా చూపి, తమ సొంత ప్రయోజనాలను చక్కదిద్దుకునే నాయకత్వాలకు భిన్నంగా పని చేస్తుందని తెలిపారు. తమ హక్కుల సాధన కోసం, రాష్ట్రంలోని జర్నలిస్టులు ఐక్యంగా ముందుకు రావాల్సిన తరుణం ఏర్పడిందని అన్నారు. అంతర్గాం, రామగుండం ప్రెస్ క్లబ్ ల అధ్యక్షుడు పంజాల రాధాస్వామిగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్గాం సర్పంచ్ ఆంబోతు రవికుమార్, గోలివాడ సర్పంచ్ కొలిపాక చంద్రారెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి పూదరి సత్తయ్య గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగం కిరణ్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, గౌడ సంఘం నాయకులు సింగం సత్తయ్య గౌడ్, బందారపు బుగ్గరాములు గౌడ్, కాంగ్రెస్ నాయకులు బొడ్డు లింగ మూర్తి, ఆవుల గోపాల్ యాదవ్, గౌస్ పాషా, గౌస్ బాబా, అప్పాసి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ సభ్యులు కాంపల్లి మల్లికార్జునస్వామి, దాసరి విష్ణు కుమార్, పల్లికొండ మధుకర్, తగురం కరుణాకర్, ఆరెపల్లి క్రాంతి కిరణ్, పూసాల రవి, కంది నాగరాజు, తూండ్ల శ్రీనివాస్ పటేల్, నగునూరి రాజయ్య గౌడ్, గౌడ సతీష్ కుమార్, కాసర్ల శంకర్, నంది సంతోష్ పాల్గొన్నారు.












