తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న మండలం పోచంపాడ్ ఎక్స్రోడ్డును నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం పరిశీలించారు. 44వ జాతీయ రహదారిపై ఉన్న ఈ కూడలి వద్ద ఇటీవల వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అధికారులు, స్థానికులతో ఆయన మాట్లాడారు.
పోచంపాడ్ ఎక్స్‌రోడ్డు వద్ద శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కలెక్టర్‌ను కోరారు. రహదారి దాటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా వంతెన లేదా భూగర్భ మార్గం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. అధిక వేగంతో వెళ్లే వాహనాలను నియంత్రించేందుకు అవసరమైన ప్రాంతాల్లో వేగ నిరోధకాలు, వేగ నియంత్రణ సూచికలు, వేగాన్ని గుర్తించే కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. రహదారి పక్కన అనధికారికంగా వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రివేళల్లో ప్రమాదాల నివారణకు వీధి దీపాలు, ప్రతిబింబించే సూచికలు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తక్షణ భద్రతా చర్యలతో పాటు పోచంపాడ్ ఎక్స్‌రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్, తహసీల్దార్ శ్రీనివాస్, రూరల్ సీఐ జాన్‌రెడ్డి, ఎస్ఐలు సువాసిని, జాతీయ రహదారి అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.












