నిజామాబాద్ రైల్వే స్టేషన్లో మంగళవారం దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. సింగిల్ ట్రాక్ కారణంగానే ఈ జాప్యం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ఈ మార్గంలో డబుల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సాయంత్రం 3:55 గంటలకు రావాల్సిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు 4:20 గంటలకు ప్లాట్ఫారం నంబర్ 1పైకి చేరింది. అనంతరం మరో 20 నిమిషాల పాటు స్టేషన్లోనే నిలిచి 4:42 గంటలకు బయలుదేరింది. దీంతో రైలు మొత్తం సుమారు 40 నిమిషాలు ఆలస్యమైనట్లు ప్రయాణికులు తెలిపారు.
సింగిల్ ట్రాక్ కావడంతో ఎదురుగా వస్తున్న ఇంటర్సిటీ రైలు కోసం దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని ప్రయాణికులు పేర్కొన్నారు. ఇదే రైలు అంతకుముందు ఉప్పల్వాయి స్టేషన్లోనూ ఇదే విధంగా నిలిచిందని తెలిపారు.
రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఈ మార్గంలో డబుల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ముంబైకి వలస వెళ్లే వారికి దేవగిరి ఎక్స్‌ప్రెస్ కీలకమైన రైలుగా ఉందని పేర్కొన్నారు.
రాజ్యరాణి, తపోవన్ ఎక్స్‌ప్రెస్‌లను నాందేడ్ నుంచి నిజామాబాద్ వరకు, అజంతా ఎక్స్‌ప్రెస్‌ను మన్మాడ్ నుంచి ముంబై వరకు పొడిగించాలనే తమ దీర్ఘకాలిక డిమాండ్‌ను రైల్వే శాఖ పరిశీలించాలని కోరారు.












