బాసరలోని శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమంలో ఆదివారం అష్టావధాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ తెలుగు కళానిలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, భాషాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నిర్మల్‌కు చెందిన అంబికానాథ శర్మ సౌజన్యంతో, కడారి దశరథ్, పీసర శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. సరస్వతీ స్తూపం, కోటి పార్థివలింగ స్తూపంతో కూడిన ద్వాదశ జ్యోతిర్లింగ మందిరం ఈ సాహిత్య విందునకు వేదికైంది. ప్రముఖ అవధాని బానావత్ నితిన్ నాయక్ తన ప్రతిభతో సభికులను మంత్రముగ్ధులను చేశారు. నిషిద్ధాక్షరి, సమస్యాపూరణ, దత్తపది, వర్ణన, ఛందోభాషణం, ఆశువు, అప్రస్తుత ప్రసంగం, న్యాస్తాక్షరి వంటి ఎనిమిది విభాగాలలో ఆయన ప్రతిభ ప్రదర్శించారు. ఈ విభాగాలలో కోవెల శ్రీనివాసాచార్యులు, కడారి దశరథ్, జాదవ్ పుండలీక్ రావు పాటిల్, పీసర శ్రీనివాస్ గౌడ్, బొందిడి పురుషోత్తమరావు, పడిగెల దేవీదాస్, గంగుల చిన్నన్న, కృష్ణ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. వారి వారి విభాగాలలో వారు తమదైన శైలిలో ప్రదర్శన ఇచ్చారు. అవధాని బానావత్ నితిన్ నాయక్, వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమయస్ఫూర్తితో, సాహితీ ప్రతిభతో సమాధానాలు అందించి సభికుల మన్ననలు పొందారు. ఈ కార్యక్రమానికి తెలుగు పండితులు, భాషాభిమానులు, కవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.












