ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎస్ఐఆర్-2026 ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఈ సూచనలు చేశారు.
ఓటర్లను కార్యాలయాలకు పిలిచి నోటీసులు, పత్రాలు స్వీకరించరాదని సీఈఓ స్పష్టం చేశారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు, అవసరమైన పత్రాలను వారి ఇళ్ల వద్దే స్వీకరించాలని సూచించారు. సాధారణంగా ఓటర్లను విచారణ కోసం కార్యాలయాలకు పిలవరాదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని ఆదేశించారు. కొత్త ఓటరు నమోదుకు ఫారం-6 సమర్పించే సమయంలో డిక్లరేషన్ తప్పనిసరిగా ఉండాలని సీఈఓ తెలిపారు. ఈఆర్వో కార్యాలయాల నోటీసు బోర్డులపై ఫారం-6, ఫారం-7కు సంబంధించిన పెండింగ్, పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ప్రదర్శించాలని సూచించారు. పెండింగ్ నోటీసుల జారీపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదును కూడా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. ఎస్ఐఆర్-2026 ప్రక్రియలో మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేస్తూ, ప్రతి దశను పారదర్శకంగా పూర్తి చేయాలని సీఈఓ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.












