మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యురాలు నక్కా సుశీల రాణి మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయారు. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా బలహీనపడ్డాయని పోలీసు అధికారులు తెలిపారు. వ్యూహాత్మక చర్యల ఫలితంగా 2024లో ఇప్పటివరకు 266 మంది అజ్ఞాత మావోయిస్టులు హింసామార్గాన్ని వీడి లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యురాలు నక్కా సుశీల రాణి మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయారు. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా బలహీనపడ్డాయని పోలీసు అధికారులు తెలిపారు. ప్రత్యేక నిఘా విభాగం, గ్రేహౌండ్స్, జిల్లా పోలీసుల సమన్వయంతో చేపట్టిన వ్యూహాత్మక చర్యల ఫలితంగా 2024లో ఇప్పటివరకు 266 మంది అజ్ఞాత మావోయిస్టులు హింసామార్గాన్ని వీడి లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, 12 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 25 మంది డివిజన్ కమిటీ కార్యదర్శులు, సభ్యులు ఉన్నారని తెలిపారు. అలాగే 94 మంది ప్రాంత కమిటీ సభ్యులు, 131 మంది సాధారణ మావోయిస్టులు లొంగిపోయినట్లు వెల్లడించారు. దీంతో మావోయిస్టు పార్టీ వ్యవస్థ అగ్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు తీవ్రంగా దెబ్బతిన్నదని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, జడె రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు అనే ముగ్గురు నేతలు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సుశీల రాణి లొంగుబాటుతో తెలంగాణలో మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడిందని అధికారులు పేర్కొన్నారు. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన నేతలు, సభ్యులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకుని సాధారణ జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.












