మండలం రామునిపట్ల గ్రామంలో జరుగుతున్న భూ భారతి - రీ సర్వే ప్రక్రియను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామునిపట్ల గ్రామం 1120 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, రోజుకు 35-40 ఎకరాల చొప్పున సర్వే చేస్తున్నారని తెలిపారు.
సుమారు 100 ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి-రీ సర్వేను చేపట్టి భూములకు శాశ్వత పరిష్కారం అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని కలెక్టర్ హైమావతి తెలిపారు. ముందుగా ప్రభుత్వ స్థలాలు, నక్ష బాటలు, చెరువులు, కుంటలు కొలిచిన తర్వాత పట్టా భూములను సర్వే చేస్తారని వివరించారు. పట్టా భూములను కొలిచే రోజు గురించి రైతులకు, భూ యజమానులకు రెండు రోజుల ముందుగానే సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. రీ సర్వే సమయంలో భూ యజమానులు గమనించి, ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని, పరిష్కారం కాకపోతే స్థానిక తాసిల్దార్కు దరఖాస్తు చేసుకుంటే 60 రోజుల్లోపు పరిష్కారం చూపుతామని తెలిపారు.
రైతులు, భూ యజమానులు సర్వే జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా తమ పనులను పక్కనపెట్టి సర్వేలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. హద్దుల సమస్యలు, సర్వే నంబర్ల గందరగోళం వంటి సమస్యలు ఉన్నాయని అధికారులపై ఆగ్రహానికి గురికాకుండా, సర్వే అధికారులకు సహకరించి తమ భూమి కొలతలను సరిగ్గా సర్వే చేయించుకోవాలని కోరారు. జిల్లాలో మొదటి విడతలో 73 గ్రామాలను, రెండో విడతలో ఇప్పటివరకు 30 గ్రామాలను సర్వే చేశామని, జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లోనూ సర్వే పూర్తవుతుందని తెలిపారు. భూ యజమానులు, రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సలీం, గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ బైటి శంకర్, సర్వే అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.












