దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు తప్పనిసరిగా సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారుల నుండి అనుమతి పొందాలని పోలీస్ కమీషనర్ వెల్లడించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునేవారు, వారి వారి సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని పోలీస్ కమీషనర్ సూచించారు. అనుమతికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి అధికారిని సంప్రదించవచ్చు.
అనుమతి లేకుండా దుకాణాలు పెడితే చర్యలు
ఎవరైనా సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి నుండి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే, వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్టు - 1884 మరియు రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ కమీషనర్ స్పష్టం చేశారు.
టపాకాయల దుకాణాలకు ముఖ్య నిబంధనలు
టపాకాయల దుకాణాదారులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలని పోలీస్ కమీషనర్ ఆదేశించారు. దుకాణాలను సంబంధిత ఖాళీ ప్రదేశాలలోనే నెలకొల్పాలి. ఆ ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికేటును తప్పనిసరిగా పొందాలి. ఒక క్లస్టర్లో 50 షాపులకు మించి ఉండరాదు.
జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో, కళ్యాణ మండపాలలో మరియు సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేయరాదని సూచించారు. తాత్కాలిక టపాకాయల దుకాణాలలో అగ్ని ప్రమాదాలకు సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు ఫారంను సంబంధిత ఎ.సి.పి గారి కార్యాలయంలో పొందవచ్చని, తద్వారా అనుమతి ప్రక్రియను సులభతరం చేసుకోవచ్చని పోలీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.












