జగిత్యాల: గణేశ్ నిమజ్జనోత్సవ బందోబస్తులో ట్రాన్స్జెండర్లను భాగస్వామ్యం చేస్తూ, ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించే అవకాశం జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఐపీఎస్ తెలిపారు. సమాజంలో సమానత్వం, గౌరవం, వివక్ష రహిత వాతావరణాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాన్స్జెండర్లతో నిర్వహించిన సమావేశంలో, నిమజ్జనోత్సవ బందోబస్తులో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించనున్న 17 మంది ట్రాన్స్జెండర్లకు టీషర్టులను అందజేశారు. వారికి విధుల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు, మార్గదర్శకాలు చేశారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, వినాయక విగ్రహాలు భారీగా తరలివచ్చే ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసు సిబ్బందితో కలిసి ట్రాన్స్జెండర్లు విధులు నిర్వహిస్తారని ఎస్పీ తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు.
ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు, గౌరవం కల్పించాలనే సానుకూల సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి బాధ్యతాయుతమైన విధుల్లో ట్రాన్స్జెండర్లు పోలీసు సిబ్బందితో కలిసి పనిచేయడం అభినందనీయమని ఆయన అన్నారు.
జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు విస్తృత బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. నిమజ్జన మార్గాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడటం, ట్రాఫిక్‌ను సజావుగా కొనసాగించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.
నిమజ్జనోత్సవానికి వచ్చే భక్తులు, ప్రజలు పోలీసుల సూచనలు పాటించి ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు.












