దశాబ్దాలుగా కరువు, తాగునీటి కొరత, ఫ్లోరైడ్ సమస్యలతో సతమతమవుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ఆశాకిరణంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను నల్లమల కొండల మీదుగా తరలించేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి, అక్కడి నుంచి వివిధ కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు.
తొలి దశతో ప్రయోజనాలు
వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ అందుబాటులోకి రావడంతో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల పరిధిలో సుమారు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటి సరఫరా పెరగడం ద్వారా ప్రజలపై ఉన్న దీర్ఘకాలిక నీటి సమస్య తగ్గే అవకాశం ఉంది. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో వ్యవసాయానికి నీటి లభ్యత పెరగడంతో సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల పరిస్థితి, గ్రామీణ ఆర్థిక కార్యకలాపాలపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టు కోసం 18.8 కిలోమీటర్ల మేర జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువల నిర్మాణం పూర్తయింది. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.10,200 కోట్లు కాగా, తొలి దశ పూర్తికి ఇప్పటివరకు రూ.7,983 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు, గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలను కూడా సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
కృష్ణా జలాలను కరువు పీడిత ప్రాంతాలకు తరలించి, సాగు, తాగునీటి అవసరాలను తీర్చడమే వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. తొలి దశ ప్రారంభంతో ఈ ప్రాంతంలో నీటి లభ్యతకు కొత్త మార్గం ఏర్పడింది.











