తెలంగాణ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియను అర్హులైన పట్టభద్రులందరూ బాధ్యతగా సద్వినియోగం చేసుకోవాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, పోటీ చేసిన శాసనసభ్యుల అభ్యర్థి ఇంజనీర్ కే. బాబురామ్ నాయక్ పిలుపునిచ్చారు. చట్టసభల్లో ప్రజా సమస్యలపై గళమెత్తే ప్రతినిధులను ఎన్నుకునే హక్కు పట్టభద్రులకు మాత్రమే ఉందని ఆయన గుర్తుచేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌర చైతన్యం, విద్యావంతుల క్రియాశీలక భాగస్వామ్యం ఎంతో కీలకమని, తెలంగాణ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియను అర్హులైన పట్టభద్రులందరూ బాధ్యతగా సద్వినియోగం చేసుకోవాలని పోటీ చేసిన శాసనసభ్యుల అభ్యర్థి, రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు ఇంజనీర్ కే. బాబురామ్ నాయక్ (ఎంటెక్) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టసభల్లో ప్రజా సమస్యలపై, విద్యా, ఉపాధి, నిరుద్యోగ సమస్యలపై గళమెత్తే సమర్థవంతమైన ప్రతినిధులను ఎన్నుకునే విశేషమైన రాజ్యాంగ హక్కు పట్టభద్రులకు మాత్రమే కల్పించబడిందని గుర్తుచేశారు. ఈ విశిష్ట అవకాశాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉపయోగించుకుని ఓటరుగా నమోదు కావాలని కోరారు.
2028 నుంచి ప్రారంభమైన ఈ ఓటరు నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 2021 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ (సాధారణ లేదా సాంకేతిక విద్య) ఉత్తీర్ణులై కనీసం మూడేళ్లు పూర్తయిన వారు (అనగా 2021 లేదా అంతకుముందు డిగ్రీ పూర్తి చేసినవారు) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వివరించారు. సాధారణ శాసనసభ లేదా పార్లమెంట్ ఎన్నికల ఓటర్ జాబితా మాదిరిగా ఇది శాశ్వతం కాదని, ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతిసారీ ఓటర్ జాబితాను మొదటి నుంచే కొత్తగా రూపొందిస్తారు కాబట్టి గతంలో పట్టభద్రుల ఓటు ఉన్నవారు కూడా ప్రస్తుతం తప్పనిసరిగా తిరిగి నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.
అర్హత కలిగిన వారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక పోర్టల్ ద్వారా అంతర్జాలంలో (ఆన్లైన్) సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ సదుపాయం లేని వారు సంబంధిత తహశీల్దార్ లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి (ఎన్నికల నమోదు అధికారుల) కార్యాలయాలలో ఫారం18 పూర్తి చేసి నేరుగా సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన డిగ్రీ పట్టా పత్రం లేదా తాత్కాలిక ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు లేదా నివాస ధ్రువీకరణ పత్రం, తాజా పాస్పోర్ట్ సైజ్ ఛాయాచిత్రం జతచేయాల్సి ఉంటుందని తెలిపారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు నిర్ణీత గడువు ముగిసేవరకు వేచి చూడకుండా వెంటనే తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని, సమాజ మార్పులో విద్యావంతులు ముందంజలో ఉంటూ అర్హులైన తమ మిత్రులు, బంధువులను కూడా ఓటర్లుగా నమోదు చేయించేందుకు సహకరించాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ తరఫున కే. బాబురామ్ నాయక్ విజ్ఞప్తి చేశారు.












