8వ వేతన సంఘం సిఫారసులపై ఉద్యోగులతో పాటు పింఛనుదారుల సంఘాలు తమ డిమాండ్లను ముందుకు తెస్తున్నాయి. ముఖ్యంగా కనీస పింఛన్ పెంపు, పాత పింఛన్ విధానం పునరుద్ధరణ వంటి అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. భారత్ పెన్షనర్స్ సమాజ్ కనీస పింఛన్‌ను రూ.45,000కు పెంచాలని కోరింది.
8వ వేతన సంఘం సిఫారసులపై ఉద్యోగులతో పాటు పింఛనుదారుల సంఘాలు కూడా తమ డిమాండ్లను ముందుకు తెస్తున్నాయి. ముఖ్యంగా కనీస పింఛన్ పెంపు, పాత పింఛన్ విధానం పునరుద్ధరణ వంటి అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
పింఛనుదారుల తరఫున పనిచేస్తున్న భారత్ పెన్షనర్స్ సమాజ్, 8వ వేతన సంఘం ముందు పలు ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. ఇందులో కనీస నెలవారీ పింఛన్‌ను రూ.45,000కు పెంచాలని ప్రధానంగా కోరింది. అలాగే, ఉద్యోగి పదవీ విరమణకు ముందు పొందిన చివరి మూల వేతనంలో 67 శాతం పింఛన్‌గా ఇవ్వాలని, కుటుంబ పింఛన్‌ను చివరి వేతనంలో 50 శాతంగా నిర్ణయించాలని ప్రతిపాదించింది.
పాత పింఛన్ విధానం పునరుద్ధరణకు డిమాండ్
2004 తర్వాత కేంద్ర ప్రభుత్వ సేవలో చేరిన ఉద్యోగులకు అమల్లోకి వచ్చిన కొత్త పింఛన్ విధానంపై పలు ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మార్కెట్ ఆధారిత రాబడిపై ఆధారపడే ప్రస్తుత విధానం, పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతకు సరిపోదని కొన్ని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
దీంతో పాత పింఛన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని 8వ వేతన సంఘాన్ని కోరుతున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించే ప్రతిపాదన లేదని గతంలో పార్లమెంట్లో స్పష్టం చేసింది.
8వ వేతన సంఘం నివేదిక ఎప్పుడు
ఉద్యోగులు, పింఛనుదారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో 8వ వేతన సంఘం సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలు, డిమాండ్లను స్వీకరిస్తోంది. వేతనాలు, భత్యాలు, పింఛన్లలో మార్పులకు సంబంధించిన అంశాలపై సంఘం సిఫారసులు చేయనుంది.
ప్రస్తుతం పింఛన్ పెంపునకు సంబంధించి పలు అంచనాలు, డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, తుది పింఛన్ మొత్తం ఇంకా నిర్ణయించబడలేదు. 8వ వేతన సంఘం తన తుది నివేదికను సమర్పించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫారసులను పరిశీలించి అమలుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.












