అమెరికాలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నందున, డిసెంబర్లో వడ్డీ రేట్లను 0.25% పెంచడానికి ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ క్రిస్టోఫర్ జె. వాలర్ మద్దతు తెలిపారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) గవర్నర్ క్రిస్టోఫర్ జె. వాలర్ డిసెంబర్లో జరిగే ద్రవ్య విధాన సమీక్షలో వడ్డీ రేట్లను 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచడానికి తాను మద్దతు ఇస్తానని వెల్లడించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలో కొనసాగుతుండటంతో వడ్డీ రేట్ల పెంపు అవసరమని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో తగ్గినా కూడా 25 బేసిస్ పాయింట్ల పెంపునకు తాను మద్దతు ఇస్తానని తెలిపారు. ఒకవేళ ద్రవ్యోల్బణం అంచనాలకు మించి పెరిగితే మాత్రం 0.50 శాతం (50 బేసిస్ పాయింట్లు) వడ్డీ రేట్ల పెంపును పరిశీలించాలని ఆయన సూచించారు.
అమెరికాలో సెప్టెంబర్ నెలలో వ్యక్తిగత వినియోగ వ్యయాల ఆధారిత ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 3.7 శాతానికి చేరగా, ఆహారం, ఇంధన ధరలను మినహాయించిన కోర్ పీసీఈ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా నమోదైంది. ఫెడ్ లక్ష్యమైన 2 శాతంతో పోలిస్తే ఈ స్థాయిలు అధికంగా ఉన్నాయని వాలర్ పేర్కొన్నారు. ముఖ్యంగా వస్తువులు, సేవల ధరల పెరుగుదల విస్తృతంగా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పెట్టుబడుల పెరుగుదల కారణంగా హైటెక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని, అలాగే అంతర్జాతీయంగా ఇంధన ధరలు అధికంగా ఉండటం వల్ల ఇతర వస్తువులు, సేవల ధరలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన వివరించారు. చమురు ధరలు ఎక్కువకాలం అధిక స్థాయిలో కొనసాగితే 2027 వరకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే మార్కెట్లలో అంచనాలు మారి రుణ వ్యయాలు తగ్గే అవకాశం ఉందని, తద్వారా ద్రవ్యోల్బణ నియంత్రణ ప్రయత్నాలకు ఆటంకం కలగవచ్చని వాలర్ అభిప్రాయపడ్డారు. 9 తేదీల్లో జరగనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.





