అమెరికాలోని టెక్సాస్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు జరిపిన కాల్పుల్లో గాయపడిన 28 ఏళ్ల వెనిజులా వ్యక్తిని ఆసుపత్రి నుంచి విడుదల చేసిన అనంతరం ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐస్) నిర్బంధ కేంద్రానికి తరలించారు. అయితే, అతడి వెన్నులో బుల్లెట్ ఇంకా అలాగే ఉన్నప్పటికీ అతడిని కస్టడీలోకి తీసుకున్నారని అతడి న్యాయవాది తెలిపారు.
విల్బర్ రాఫెల్ గార్సెస్ పెరెజ్ అనే వ్యక్తి ఆస్టిన్‌లో డోర్‌డాష్ డెలివరీ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు అతడి న్యాయవాది కేట్ లింకన్-గోల్డ్‌ఫించ్ వెల్లడించారు. గుర్తు తెలియని వాహనంలో ఉన్న ఐస్ అధికారులు తన కారును రెండుసార్లు ఢీకొట్టారని, అనంతరం తనపై కాల్పులు జరిపారని పెరెజ్ ఆరోపించాడు. అయితే, ఈ ఘటనపై అధికారుల వాదన భిన్నంగా ఉంది. ఆస్టిన్ పోలీసులు పెరెజ్ కాలినడకన పారిపోయాడని పేర్కొన్నారు.
కాల్పుల్లో బుల్లెట్ అతడి వెన్నెముకకు సమీపంలో చిక్కుకుపోవడంతో వైద్యులు దానిని తొలగించలేదని పెరెజ్ తెలిపాడు. ఆసుపత్రి నుంచి విడుదలైన తర్వాత తనను దక్షిణ టెక్సాస్ ఐస్ ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలించారని, అక్కడ తీవ్రమైన నొప్పితో ఉన్నప్పటికీ తగిన వైద్యసాయం, నొప్పి నివారణ మందులు అందలేదని అతడు చెప్పాడు.
ఈ ఘటనపై హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ దర్యాప్తు చేపట్టిందని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. ఎఫ్‌బీఐ సహకారంతో విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిపిన అధికారిని దర్యాప్తు పూర్తయ్యే వరకు పరిపాలనా సెలవుపై పంపినట్లు కూడా పలు నివేదికలు పేర్కొన్నాయి.
పెరెజ్‌కు అమెరికాలో తుది బహిష్కరణ ఉత్తర్వు ఉన్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. అయితే, కాల్పులు ఎలా జరిగాయి, ఆ సమయంలో అధికారులు తీసుకున్న చర్యలు చట్టబద్ధమైనవేనా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.











