ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక విమానాలు గాల్లోనే ఢీకొని కుప్పకూలాయి. ఈ దుర్ఘటనలో విమానాల్లో ఉన్న నలుగురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం ( ) మధ్యాహ్నం చోటుచేసుకోగా, శనివారం ( ) ఫిలిప్పీన్స్ వైమానిక దళం మరణాలను ధ్రువీకరించింది.
అధికారుల వివరాల ప్రకారం, ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా సమీపంలోని బటాంగాస్ ప్రావిన్స్‌లో ఉన్న ఫెర్నాండో వైమానిక స్థావరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. శిక్షణలో భాగంగా ఎగురుతున్న రెండు ఎస్ఎఫ్-260 రకం విమానాలు శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3.51 గంటల సమయంలో ప్రమాదానికి గురయ్యాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, రెండు విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో గాల్లోనే ఒకదానికొకటి ఢీకొన్నాయి. అనంతరం నియంత్రణ కోల్పోయి వైమానిక స్థావరం పరిధిలో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లో ఉన్న నలుగురు పైలట్లు అక్కడికక్కడే మరణించారు.
స్థావరంలోనే కూలిన విమానాలు
రెండు విమానాలు వైమానిక స్థావరం పరిధిలోనే కూలిపోయినట్లు ఫిలిప్పీన్స్ వైమానిక దళం వెల్లడించింది. ప్రమాదంలో నేలపై ఉన్న ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే, విమానాలు గాల్లో ఢీకొనడానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ప్రమాదంపై విచారణ ప్రారంభించినట్లు వైమానిక దళం ప్రకటించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎస్ఎఫ్-260 రకం విమానాలన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. విమానాల నిర్వహణ, శిక్షణ సమయంలో అనుసరించిన విధానాలు, ప్రమాదానికి దారితీసిన ఇతర అంశాలపై అధికారులు పరిశీలన చేపట్టనున్నారు.
పైలట్ల మృతిపై సంతాపం
నలుగురు పైలట్లు మరణించడంపై ఫిలిప్పీన్స్ వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. మృతుల వ్యక్తిగత వివరాలను వెల్లడించే విషయంలో కుటుంబాల గోప్యతను గౌరవించాలని ప్రజలను కోరింది.
ఎస్ఎఫ్-260 శిక్షణ విమానాలకు సంబంధించి గతంలోనూ ప్రాణాంతక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని బెంగ్వెట్ ప్రావిన్స్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించారు. 2023లో జరిగిన మరో శిక్షణ విమాన ప్రమాదంలోనూ ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు ఎస్ఎఫ్-260 విమానాల కార్యకలాపాలను నిలిపివేయడం ద్వారా మరిన్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఫిలిప్పీన్స్ వైమానిక దళం వెల్లడించింది.











