నిర్మల్, 14 November
పేదల సొంతింటి కలను నెరవేరుస్తామన్న ప్రభుత్వ హామీ క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు శాపంగా మారింది.
పేదల సొంతింటి కలను నెరవేరుస్తామన్న ప్రభుత్వ హామీ క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు శాపంగా మారింది. పేరుకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి కానీ, నెలలు గడుస్తున్నా బిల్లులు మాత్రం చేతికందడం లేదు. ప్రభుత్వం డబ్బులు ఇస్తుందన్న ఆశతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న పేదలు, ఇప్పుడు బిల్లులు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ కన్నీటి వేదన అనుభవిస్తున్నారు. ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోతే నివాసం ఉండలేమనే ఉద్దేశంతో తమ వద్ద ఉన్న కొద్దిపాటి బంగారాన్ని తాకట్టు పెట్టి, ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి గోడలు లేపారు. స్లాబ్లు వేసి నిర్మాణాలు పూర్తి చేశారు. అయితే, వివిధ దశలలో రావాల్సిన బిల్లులు సకాలంలో ఖాతాల్లో జమ కాకపోవడంతో వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. అప్పులిచ్చిన వారి ఒత్తిడి భరించలేక పేద కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. మంజూరైన బిల్లుల కోసం మండల పరిషత్ కార్యాలయాలు, హౌసింగ్ అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సాంకేతిక కారణాలు, నిధుల కొరత అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. కూలి పనులు చేసుకుని జీవించే తమకు ఈ అప్పులు తీర్చే దారి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని వేడుకుంటున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పేద కుటుంబాలను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






