నిర్మల్, 2026-11-10
జిల్లాలో అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పూర్తి పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో, జిల్లా అక్రెడిటేషన్ కమిటీ మూడో విడత సమావేశం జరిగింది.
జిల్లాలో అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పూర్తి పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో, జిల్లా అక్రెడిటేషన్ కమిటీ మూడో విడత సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అందిన దరఖాస్తులను పరిశీలించి, అర్హతలు, నిబంధనల అమలుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. జర్నలిస్టులు వృత్తి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రతిరోజూ దినపత్రికల ప్రచురణ, హాజరు వివరాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందినట్లు గుర్తిస్తే వాటిని రద్దు చేస్తామని తెలిపారు.
అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కార్డులను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో అక్రెడిటేషన్ కన్వీనర్ మెంబర్, డి పి ఆర్ ఓ ఇ. విష్ణువర్ధన్, కమిటీ సభ్యులు అల్వాల హనుమంతు, రవీందర్, మహేష్, రాజేశ్వర్, అశోక్, నాగరాజు, వసీం, ప్రేమ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






