కుబేర హోటల్ సమీపంలో, భైంసా, నిర్మల్, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 10
భైంసా మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్, డిప్యూటీ ఇంజినీర్ జాదవ్ సంతోష్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని సమాచారం.
వివరాల్లోకి వెళితే.. భైంసా మున్సిపాలిటీలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లు చెల్లింపు విషయంలో సదరు కాంట్రాక్టర్‌ను జాదవ్ సంతోష్ రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధిత కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారుల సూచనల మేరకు మంగళవారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా సమీపంలో ఉన్న కుబేర హోటల్ వద్ద కాంట్రాక్టర్ నగదును జాదవ్ సంతోష్‌కు అందజేశారు. అదే సమయంలో ముందస్తు ప్రణాళికతో అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
ఈ ఘటనతో భైంసా మున్సిపల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
కాగా, ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారుల పూర్తి వివరాలు, తదుపరి చర్యలు తెలియాల్సి ఉంది.






