అమరావతి, 10 November
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 26న జరగనున్నాయి. ఈ ఎన్నికలతో పాటే పెండింగ్లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థలకు కూడా పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిర్ణయించింది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో తొలి విడతగా ఈ నెల 26న నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలతోపాటే, పెండింగ్లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థలకు కూడా పోలింగ్ చేపట్టనున్నారు. కలెక్టర్లు, ఎస్పీల సూచనల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 26న సుమారు 4 వేల పంచాయతీలకు తొలి విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు.
పెండింగ్లో ఉన్న శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలతోపాటు 19 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఎస్ఈసీకి శనివారం లేఖ రాసింది.
వీటికి మళ్లీ ప్రత్యేకంగా పోలింగ్ నిర్వహించడం కంటే, తొలి దశ పంచాయతీ ఎన్నికలతోపాటే పూర్తిచేయాలని ఎస్ఈసీ భావిస్తోంది. పోలింగ్ సిబ్బంది, పోలీసు బందోబస్తు పరంగా సంసిద్ధతపై సోమవారం కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా తెలుసుకున్నారు. సున్నిత, అత్యంత సున్నిత పంచాయతీలను తొలి విడత పోలింగ్లో చేర్చొద్దని కలెక్టర్లు, ఎస్పీలు అభిప్రాయపడ్డారు. ఎన్నికలు నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థలకు సమీపంలో, గొడవలకు ఆస్కారం లేని పంచాయతీలను తొలిదశలో చేరిస్తే సిబ్బంది, పోలీస్ బందోబస్తు పరంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదని వారు పేర్కొన్నారు.






