నేరడిగొండ, 9 November
ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు దండారి (గుస్సాడి) ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని రోల్ మామడ గ్రామంలో నిర్వహించిన సంప్రదాయ దండారి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు దండారి (గుస్సాడి) ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని రోల్ మామడ గ్రామంలో నిర్వహించిన సంప్రదాయ దండారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్థులు, ఆదివాసీ పెద్దలు, యువకులు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.
అనంతరం గ్రామంలో నిర్వహించిన దండారి వేడుకల్లో ఎమ్మెల్యే ఆదివాసీలతో కలిసి పాల్గొని సంప్రదాయ నృత్యాలను వీక్షించారు. కళాకారుల నృత్యాలు, డప్పుల మోతలు, సంప్రదాయ వేషధారణలు, ఆటపాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సైతం ఆదివాసీలతో కలిసి సందడి చేస్తూ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు మన ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపునిస్తాయని తెలిపారు. తరతరాలుగా వస్తున్న దండారి ఉత్సవాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆదివాసీల కళలు, ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు వాటి ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పాలని అన్నారు.
దండారి ఉత్సవాలు ఆదివాసీ సమాజ ఐక్యతకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొంటూ, ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న గ్రామ పెద్దలు, యువత, మహిళలు, కళాకారులను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆదివాసీ నాయకులు, యువకులు, మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.











