బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు దండారి, గుస్సాడి ఉత్సవాలు ప్రతీకలని, తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, కళలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
మండలంలోని సకినాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల నడుంపల్లి గ్రామంలో నిర్వహించిన ఆదివాసీల సంప్రదాయ దండారి, గుస్సాడి ఉత్సవాల్లో మాజీ ఎంపీ సోయం బాపురావు, జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డితో కలిసి ఆడే గజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు, ఉత్సవాల్లో పాల్గొని ఆదివాసీ ప్రజలతో మమేకమయ్యారు.
ఆదివాసీల ప్రత్యేకత
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ సమాజానికి దండారి, గుస్సాడి ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షించుకోవాలని సూచించారు. ఇలాంటి పండుగలను ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఘనంగా నిర్వహించుకోవాలని, ఆదివాసీల ప్రత్యేక సంస్కృతిని భావితరాలకు పరిచయం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బొల్లరపు బాబన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కసుల ప్రతాప్, మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, ప్రకాశ్ రావు, గ్రామ పటేల్ నైతం అయ్యు, ఆత్రం జంగు, సిడాం చిన్ను, సర్పంచ్ మేస్రం నికిత నగేష్, ఉప సర్పంచ్ ఆత్రం సంతోష్, మండల ఉపాధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, సాంబశివతో పాటు పలువురు పాల్గొన్నారు.











