తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళా సంఘం నాయకురాలు బైతి వెంకటలక్ష్మికి ప్రతిష్టాత్మక దొడ్డి కొమురయ్య జాతీయ అవార్డు2026 దక్కింది. బహుజన సాహిత్య అకాడమీ ఈ అవార్డును ప్రకటించింది. న్యూఢిల్లీలో జరగనున్న బహుజన సాహిత్య అకాడమీ 20వ జాతీయ మహాసభల్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
మహిళా హక్కులు, సామాజిక న్యాయం, మానవ హక్కులు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం వివిధ సంఘాల ద్వారా విశేష సేవలందిస్తున్న బైతి వెంకటలక్ష్మిని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అవార్డు సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అకాడమీ జాతీయ అధ్యక్షులు, అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ నల్లా రాధాకృష్ణ ఆమెకు అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సాహిత్యం, సంస్కృతి, సామాజిక ఉద్యమాలను ప్రోత్సహించడంతో పాటు ప్రజా ఉద్యమకారులు, సంఘసేవకులు, రచయితలు, కవులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ఈ జాతీయ అవార్డులను అందజేస్తున్నట్లు నల్లా రాధాకృష్ణ తెలిపారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్న బహుజన సాహిత్య అకాడమీ 20వ జాతీయ మహాసభల్లో ఈ అవార్డు ప్రదానం జరగనుంది. ఈ మహాసభలకు దేశంలోని 28 రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా బైతి వెంకటలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు మహిళా ఉద్యమాల్లో పాల్గొని మహిళల హక్కుల సాధన కోసం కృషి చేశానని తెలిపారు. సమైక్య మహిళా సంఘాల అభివృద్ధి, బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, మానవ హక్కులు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం అనేక సంఘాల్లో పనిచేస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి దొడ్డి కొమురయ్య జాతీయ అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు కుంబాల రవీందర్, నెల్లుట్ల నరసవ్వ తదితరులు పాల్గొన్నారు.












