నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి తీరాన ఉన్న శ్రీ వేద భారతి పీఠంలో శ్రీశ్రీశ్రీ వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో లోకకల్యాణం, రైతుల సంక్షేమం కోసం వరుణ యాగం, మృత్యుంజయ హోమం వంటి వైదిక హోమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు.
నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి తీరాన ఉన్న శ్రీ వేద భారతి పీఠంలో శ్రీశ్రీశ్రీ వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో వైదిక హోమాలు ఘనంగా నిర్వహించారు. ధర్మో రక్షతి రక్షితః, లోకాః సమస్తాః సుఖినో భవంతు అనే సంకల్పంతో వరుణ యాగం, మృత్యుంజయ హోమం, నిత్య అన్నదాన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ యజ్ఞంలో పీఠానికి చెందిన విద్యార్థులు, ఋషికుమారులు వేద మంత్రాలను పఠిస్తూ పాల్గొన్నారు. చిన్న వయసులోనే స్పష్టంగా వేద మంత్రాలను ఉచ్ఛరిస్తూ, యాగ కార్యక్రమాలను నిర్వహించడం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వేద విద్యానంద స్వామీజీ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్య సమస్యల నేపథ్యంలో లోకశాంతి, ప్రజల ఆరోగ్యం, రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ యాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వేద సంప్రదాయం ప్రకారం, వరుణ యాగం వర్షాలు సకాలంలో కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తారని, మృత్యుంజయ హోమం ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, అకాల మృత్యు దోష నివారణను కాంక్షిస్తూ నిర్వహిస్తారని వేద పండితులు వివరించారు. ఈ కార్యక్రమానికి బాసర, నిర్మల్, భైంసా, నాందేడ్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు, శిష్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. లోకకల్యాణం, ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఈ యజ్ఞాన్ని నిర్వహించినట్లు స్వామీజీ పేర్కొన్నారు. కార్యక్రమంలో కుంటాల మండల పరిషత్ అధ్యక్షుడు రమణారావు, బాసర ఉప మండల పరిషత్ అధ్యక్షుడు ఓని నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.











